Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 7 sloka 23 to 24

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 7 sloka 23 to 24
Sloka 23-అల్పబుద్ధి కలిగిన మనుజులు దేవతలను పూజింతురు. కాని వారొసగెడి ఫలములు అల్పములు, తాత్కాలికములై యున్నవి. దేవతలను పూజించువారు దేవతాలోకములను చేరగా, నా భక్తులు మాత్రము అంత్యమున నా దివ్యలోకమునే చేరుదురు.
Sloka 24-నన్ను సంపూర్ణముగా ఎరుగని మందబుద్ధులు దేవదేవుడైన నేను(శ్రీకృష్ణుడు) తొలుత నిరాకారుడనై యుండి ఇప్పుడు ఈ రూపమును దాల్చితినని తలతురు. అల్పజ్ఞత వలన వారు నాశరహితమును మరియు అత్యుత్తమమును అగు నా దివ్యభావమును ఎరుగలేరు.
PURPORT:-
దేవతలను పూజించువారు అల్పజ్ఞులు లేదా బుద్ధిహీనులని పైన వర్ణింపబడినారు. నిరాకారవాదులు సైతము అదేవిధముగా ఇచ్చట వర్ణింపబడిరి. దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన స్వీయరూపమున అర్జునుని ఎదుట సంభాషించుచున్నను నిరాకారవాదులు తమ అజ్ఞానకారణముగా భగవానుడు రూపరహితుడనియు వాదింతురు. శ్రీరామానుజాచార్యుల పరంపరలో నున్న పరమభక్తుడైన శ్రీయమునాచార్యులు ఈ విషయమున ఒక చక్కని శ్లోకమును ఇట్లు రచించియుండిరి. “హే ప్రభూ! వ్యాసదేవుడు మరియు నారదుడు వంటి భక్తులు నీవు దేవదేవుడవని ఎరిగియున్నారు. వేదవాజ్మయమును అవగాహన చేసికొనుట ద్వారా నీ గుణములను, రూపమును, కర్మలను తెలిసికొని మనుజుడు నిన్ను దేవదేవుడని అవగతము చేసికొనగలడు. కాని రజస్తమోగుణములందున్న దానవులు మరియు అభక్తులు మాత్రము నిన్నెన్నడును ఎరుగజాలరు. వారు నిన్ను అవగాహన చేసికొనజాలకున్నారు. అభక్తులైనవారు వేదాంతమును, ఉపనిషత్తులను, ఇతర వేదవాజ్మయమును నిపుణతతో చర్చించినను ఆదిదేవుడవైన నిన్ను అవగాహన చేసికొనుట వారికి సాధ్యము కాదు.” (స్తోత్రరత్నము 12) కేవలము వేదవాజ్మయమును అధ్యయనము చేయుట ద్వారా శ్రీకృష్ణభగవానుడు తెలియబడడని బ్రహ్మసంహిత యందు తెలుపబడినది. శ్రీకృష్ణుని గూర్చి తెలియుట కేవలము అతని కరుణతోనే సాధ్యము కాగలదు.
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.