Friday 1 May 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 11 sloka 15 to 20

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 11 sloka 15 to 20
Sloka 15-అర్జునుడు పలికెను : హే కృష్ణా! సమస్తదేవతలు, ఇతర సమస్తజీవులు నీ దేహమునందు సమావిష్టులై యుండుటను నేను గాంచుచున్నాను. పద్మాసనుడైన బ్రహ్మను, శివుని, ఋషులను, దివ్యసర్పములను కూడా నీ యందు నేను దర్శించుచున్నాను.
Sloka 16-హే విశ్వప్రభూ! విశ్వరూపా! నీ దేహమునందు అపరిమితముగా సర్వత్ర వ్యాపించియున్న అనేక బాహువులను, ఉదరములను, ముఖములను, నయనములను నేను గాంచుచున్నాను. నీ యందు ఆదిమధ్యాంతములను నేను గాంచలేకున్నాను.
Sloka 17-జ్వలించు అగ్ని లేక అప్రమేయమైన సూర్యకాంతి వలె సర్వదిక్కుల యందు ప్రసరించు తేజోమయమైన కాంతి వలన నీ రూపమును గాంచుట కష్టమగుచున్నది. అయినను పెక్కు కిరీతములు, గదలు, చక్రములచే అలంకరింపబడిన నీ ఉజ్జ్వల రూపమును సర్వత్ర నేను గాంచుచున్నాను.
Sloka 18-దివ్యమైన ఆదిధ్యేయము నీవే. విశ్వమంతటికిని పరమాధారము నీవే. అవ్యయుడవు మరియు సనాతనుడవు నీవే. నీవే శాశ్వతధర్మమును రక్షించు దేవదేవుడవు. ఇదియే నా అభిప్రాయము.
Sloka 19-నీవు ఆదిమధ్యాంత రహితుడవై యున్నావు. నీ వైభవము అపరిమితమై యున్నది. అసంఖ్యాకములుగా భుజములను కలిగిన నీవు సూర్యచంద్రులను నేత్రములుగా కలిగియున్నావు. ముఖము నుండి తేజోమయమైన అగ్ని బయల్వెడలుచుండ స్వతేజముతో ఈ సమస్త విశ్వమును తపింపజేయుచున్నట్లుగా నిన్ను గాంచుచున్నాను.
Sloka 20-నీవు ఒక్కడవేయైనను సమస్త ఆకాశమును, స్వర్గలోకములను మరియు వాని నడుమగల ప్రదేశమునంతటిని వ్యాపించియున్నావు. ఓ మహానుభావా! అద్భుతమును, భయంకరమును అగు ఈ రూపమును గాంచి లోకములన్నియును కలతనొందుచున్నది.
To be continued...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.