Friday 24 April 2020

Sri Bhagavad Gita telugu lo Chapter 3 slokas 37 to 43

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 3 slokas 37 to 43
Sloka 37-శ్రీకృష్ణభగవానుడు పలికెను : అర్జునా! రజోగుణసంపర్కముచే ఉద్భవించి, తదుపరి క్రోధముగా పరిణమించి కామమే దానికి కారణము. అదియే ఈ ప్రపంచమునకు సర్వమును కబళించునట్టి పాపభూయిష్ట శత్రువు.
Sloka 38-పొగ చేత అగ్ని, ధూళి చేత అద్దము, మావి చేత గర్భము కప్పబడినట్లు కామము యొక్క వివిధ దశలచే జీవుడు కప్పుడియుండును.
Sloka 39-ఈ విధముగా జ్ఞానవంతుడైన జీవుని శుద్ధచైతన్యము ఎన్నడును తృప్తి చెందనిదియు మరయు అగ్ని వలె దహించుచునదియైన కామమనెడి నిత్యవైరిచే ఆవరింపబడును.
Sloka 40-ఇంద్రియములు, మనస్సు, బుద్ధి యనునవి ఈ కామము నివసించు స్థానములు. వాని ద్వారా కామము జీవుని నిజజ్ఞానమును ఆవరించి అతనిని మోహింపజేయును.
Sloka 41-కావున భరతవంశీయులలో శ్రేష్టుడవైన ఓ అర్జునా! ఇంద్రియనిగ్రహము ద్వారా పాప చిహ్నమైన ఈ కామమును మొట్టమొదటనే అదుపు చేసి, జ్ఞానము మరియు ఆత్మానుభవములను నాశనము చేయునట్టి అద్దానిని నశింపజేయుము.
Sloka 42-జడపదార్థము కన్నను ఇంద్రియములు ఉత్తమములు; ఇంద్రియముల కన్నను మనస్సు ఉత్తమము; మనస్సు కన్నను బుద్ధి కన్నను ఆత్మ అత్యంత ఉత్తమము.
Sloka 43-ఓ గొప్పబాహువులు గల అర్జునా! ఈ విధముగా తనను ఇంద్రియ, మనోబుద్ధులకు పరమైనవానిగా తెలిసికొని, ఆధ్యాత్మికబుద్ధిచే(కృష్ణభక్తిరసభావానము) మనస్సును స్థిరపరచి, ఆ విధముగా ఆధ్యాత్మికబలముచే మనుజుడు కామమనెడి ఈ దుర్జయమైన శత్రువును జయింపవలెను.
To be continued with 4th chapter

Sri Bhagavad Gita telugu lo Chapter 3 slokas 30 to 36

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 3 slokas 30 to 36
శ్రీ కృష్ణుడు పలికెను....
Sloka 30-కావున ఓ అర్జునా! నన్ను గూర్చిన సంపూర్ణజ్ఞానము కలవాడవై ఫలాపేక్ష మరియు మమత్వములను విడిచి, కర్మలనన్నింటిని నాకు అర్పించి మాంద్యమునకు వీడి యుద్ధము చేయుము.
Sloka 31-నా అజ్ఞానుసారము తమ కర్మలను నిర్వహించుచు శ్రద్ధతో ఈ ఉపదేశమును అసూయరహితులై అనుసరించువారు కామ్యకర్మబంధముల నుండి విడివడగలరు. 
Sloka 32-కాని అసూయతో ఈ ఉపదేశములను మన్నింపక అనుసరింపనివారలు జ్ఞానరహితులుగను, మూడులుగను, పూర్ణత్వమును పొందు యత్నములో నాశము నొందినవారిగను భావింపబడుదురు. 
Sloka 33-జ్ఞానవంతుడైన మనుజుడు సైతము తన గుణముల ననుసరించియే కర్మ నొనరించును. ఏలయన ప్రతియొక్కరు త్రిగుణముల నుండి తాము పొందిన స్వభావమునే అనుసరింతురు. అట్టి యెడ నిగ్రహమేమి చేయగలదు?
Sloka 34-ఇంద్రియములు మరియు ఇంద్రియార్థముల యెడ కలుగు రాగద్వేషములను నియమించుటకు కొన్ని నియమములు కలవు. ఆత్మానుభవ మార్గమున ఆ రాగద్వేషములు ఆటంకముల వంటివి గావున వాటికి ఎవ్వరును వశము కాకూడదు.
Sloka 35-పరధర్మము చక్కగా నిర్వహించుట కన్నను గుణరహితమైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమము. పరధర్మపాలనము హానికరమైనది కావున దానిని పాటించుట కన్నను స్వధర్మపాలనము నందు నాశనము పొందుటయైనను ఉత్తమమైనదే!
Sloka 36-అర్జునుడు పలికెను : ఓ వృష్ణివంశసంజాతుడా! అనిష్టముగానైనను బలవంతముగా నియుక్తమైనవాని వలె మనుజుడు దేనిచే పాపకర్మలను చేయుట యందు ప్రేరేపింపబడుచున్నాడు?
To be continued....

Sri Bhagavad Gita telugu lo Chapter 3 sloka 24 to 29...

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 3 sloka 24 to 29...
శ్రీ కృష్ణుడు పలికెను
Sloka 24-విధ్యుక్తధర్మమములను నేను నిర్వహింపనిచో లోకములన్నియును నాశామును పొందగలవు. అవాంఛనీయ ప్రజాబాహుళ్యమునకు నేను కారణుడనై తద్ద్వారా సర్వజీవుల శాంతిని నష్టపరచినవాడనగుదును.
Sloka 25-పామరులు ఫలములను ఆసక్తిగలవారై తమ కర్మనొనరించునట్లు, విద్వాంసుడైన వాడు జనులను ధర్మమార్గమున వర్తింపజేయుటకై సంగరహితముగా కర్మ నొనరింపవలెను.
Sloka 26-విధ్యుక్తధర్మపు ఫలముల యెడ ఆసక్తిని కలిగిన పామరుల మనస్సు కలతపడురీతిగా విద్వాంసుడు వారిని కర్మ యందు నిగ్రహింపరాదు. అందుకు భిన్నముగా అతడు భక్తిభావముతో కర్మనొనరించును (కృష్ణభక్తి వృద్ది యగుటకు) వారిని వివిధ కర్మల యందు నియుక్తులను చేయవలెను.
Sloka 27-మిథ్యాహంకారముచే మోహపరవశుడగు జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తనను కర్తగా భావించును.
Sloka 28-ఓ మాహాబాహో! పరతత్త్వజ్ఞానము కలిగినవాడు భక్తియుతకర్మము మరియు కామ్యకర్మముల నడుమ గల భేదమును చక్కగా తెలిసి, ఇంద్రియములందును మరియు ఇంద్రియభోగములందును ఆసక్తుడు గాకుండును.
Sloka 29-ప్రకృతిగుణములచే మోహపరవశులైన మూఢులు భౌతికకర్మల యందు సంపూర్ణముగా నియుక్తులైన సంగత్వము నొందుదురు. కర్తయొక్క అజ్ఞాన కారణమున ఆ కర్మలు అధమములైన జ్ఞానవంతుడు వారిని కలతపెట్టరాదు.
To be continued...

Sri Bhagavad Gita telugu lo Chapter 3 sloka 17 to 23

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 3 sloka 17 to 23
శ్రీ కృష్ణుడు పలికెను
Sloka 17-కాని ఆత్మానుభవపూర్ణమైన జీవితముతో ఆత్మ యందే ఆనందమును గొనుచు, ఆత్మ యందే తృప్తుడై పరిపూర్ణ సంతుష్టిని పొందినవానికి చేయవలసిన కర్మమేమియును లేదు.
Sloka 18-ఆత్మానుభవమును పొందిన మనుజుడు తన విధ్యుక్తధర్మనిర్వహణము ద్వారా పొందవలసిన ప్రయోజనమేదియును ఉండదు. అయినను అట్టి కర్మను నిర్వర్తింపకపోవుటకు కారణము గాని, ఇతర జీవులపై అధారపడవలసిన అవసరము గాని అతనికి ఉండదు.
Sloka 19-కనుక ప్రతియొక్కరు కర్మఫలముల యందు ఆసక్తిని గొనక తన విధియని భావించుచు కర్మల యందు వర్తించవలెను. ఏలయనగా అసంగత్వముతో కర్మ నొనరించుట ద్వారా మనుజుడు పరమును పొందగలడు.
Sloka 20-జనకమాహారాజు వంటి రాజులు కేవలము విధ్యుక్తధర్మములను నిర్వర్తించుట ద్వారానే సంపూర్ణత్వమును పొందిరి. కావున జనసామాన్యమునకు భోదించు నిమిత్తమై తప్పక నీవు కర్మను చేయుము.
Sloka 21-మహానియుడైన వ్యక్తి ఎట్టి కార్యములను చేయునో వానిని సామాన్యజనులు అనుసరింతురు. తన ఆదర్శప్రాయ కర్మము ద్వారా దేనిని అతడు ప్రమాణముగా నిర్ణయించునో దానినే లోకమంతయు అనుసరించును.
Sloka 22-ఓ పార్థా! నాకు నిర్దేశింపబడిన కర్మము ముల్లోకములలో ఏదియును లేదు. నేను కోరునది కాని, పొందవలసిన కాని ఏదియును లేకున్నను విహితకర్మల యందు నేను నియుక్తుడనై యున్నాను.
Sloka 23-ఓ పార్థా! ఒకవేళ నేను విధ్యుక్తధర్మమములను శ్రద్ధగా నిర్వహింపనిచో మనుజులు తప్పక నా మార్గమునే అనుసరింతురు.
To be continued....

Sri Bhagavad Gita telugu lo Chapter 3 sloka 11 to 16

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 3 sloka 11 to 16
శ్రీ కృష్ణుడు పలికెను
Sloka 11-యజ్ఞములచే సంతృప్తి నొందిన దేవతలు మీకు ప్రియమును గూర్చగలరు. ఆ విధముగా మానవులు మరియు దేవతల నడుమ గల పరస్పర సహకారముచే సర్వులకు శ్రేయస్సు కలుగగలదు. 
Sloka 12-వివిధ జీవనావశ్యకములను ఒనగూర్చు దేవతలు యజ్ఞముచే సంతృప్తి నొంది మీకు కావలసినవన్నియును ఒసంగుదురు. వాటిని ఆ దేవతలకు అర్పింపకయే తాను అనుభవించువాడు నిక్కముగా చోరుడే యగును. 
Sloka 13-యజ్ఞమున అర్పింపబడిన ఆహారమును స్వీకరించుట వలన భగవధ్భక్తులు సర్వవిధములైన పాపముల నుండి ముక్తులగుదురు. తమ ప్రియము కొరకే ఆహారమును సిద్ధము చేసికొనువారు కేవలము పాపమునే భుజింతురు.
Sloka 14-జీవదేహములన్నియును వర్షము వలన ఉత్పన్నమైనట్టి ధ్యానములపై ఆధారపడి జీవించును. వర్షములు యజ్ఞముచే కలుగగా, విహితకర్మము నుండి యజ్ఞము ఉద్బవించుచున్నది.
Sloka 15-నియమిత కర్మలు వేదములందు నిర్దేశింపపడగా, అట్టి వేదములు దేవదేవుని నుండి ప్రత్యక్షముగా ప్రకటింపబడినవి. అందుచే సర్వవ్యాపకమైన పరబ్రహ్మము యజ్ఞకర్మలందు నిత్యముగా ప్రతిష్టితమై యుండును.
Sloka 16-ఓ అర్జునా! ఈ విధముగా వేదములచే నిర్ణయింపబడిన యజ్ఞచక్రమును జీవితమున అనుసరింపనివాడు నిక్కముగా పాపజీవనుడగును. కేవలము ఇంద్రియతృప్తి కొరకే జీవించుచు అట్టివాడు నిరర్ధకముగా జీవనము గడుపును. 
To be continued...

Sri Bhagavad Gita telugu lo Chapter 3 sloka 8 to 10

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 3 sloka 8 to 10
శ్రీ కృష్ణుడు పలికెను  
Sloka 8-నీ విధ్యుక్తధర్మమును నీవు నిర్వర్తింపుము. ఏలయన అది అకర్మ కన్నను ఉత్తమమైనది. కర్మ నొనరింపకుండా దేహపోషణము సైతము మనుజుడు చేసికొనజాలడు.
Sloka 9-విష్ణువు కొరకై యజ్ఞరూపమున కర్మనొనరింపవలెను. లేనిచో ఈ భౌతికజగమున కర్మ బంధకారకము కాగలదు. కావున ఓ కుంతీపుత్రా! నీ విధ్యుక్తధర్మములను అతని ప్రీత్యర్థమే కావింపుము. ఆ విధముగా నీవు బంధము నుండి సదా ముక్తుడవై ఉండగలవు. 
Sloka 10-సృష్ట్యారంభమున సర్వజీవులకు ప్రభువైన భగవానుడు మానవులకు మరియు దేవతలకు విష్ణుప్రీత్యర్థమైన యజ్నములతో సహా సృష్టించి “ ఈ యజ్ఞములచే మీరు సౌఖ్యవంతులు కండు. ఏలయన వీని ఆచరణము మీ సుఖజీవనమునకు మరియు ముక్తికి కావలసిన సర్వమును ఒసంగును” అని ఆశీర్వదించెను.
PURPORT:-
సర్వజీవుల ప్రభువైన విష్ణువుచే సృష్టింపబడిన భౌతికజగత్తు బద్ధజీవులు భగవద్దామము తిరిగి చేరుటకు ఒసగాబడిన ఒక అవకాశము వంటిది. దేవదేవుడైన శ్రీకృష్ణునితో గల సంబంధమును మరచుట చేతనే ఈ జగమునందు జీవులందరును భౌతికప్రకృతిచే బద్దులగుచున్నారు. అట్టి నిత్యసంబంధమును జీవులు తెలిసికొనుటకు వేదము సహాయపడును. “వేదైశ్చ సర్వైరహమేవవేద్య:” అని ఈ విషయమునే భగవద్గీత తెలియజేయుచున్నది. తన నెరుగుటయే వేదముల ఉద్దేశ్యమని శ్రీకృష్ణభగవానుడు తెలిపియున్నాడు. “పతిం విశ్వస్యాత్మేశ్వరం” అని వేదంమంత్రములందు తెలుపబడినది. అనగా జీవులకు ప్రభువు దేవదేవుడైన విష్ణువు.
To be continued

Sri Bhagavad Gita telugu lo Chapter 3 sloka 1 to 7

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 3 sloka 1 to 7
 sloka 1-    అర్జునుడు పలికెను     : ఓ జనార్దానా,  ఓ కేశవ       , ఫలవంతమైన పని కంటే తెలివితేటలు మంచివని మీరు చెప్పారు,     మరి ఇపుడు   ఈ భయంకరమైన యుద్ధంలో నన్ను ఎందుకు నిమగ్నం చేయాలనుకుంటున్నారు?
Sloka 2-అనేకార్థములు కలిగిన నీ భోధలచే నా బుద్ధి మోహము నొందినది. కావున నాకు ఏది అత్యంత శ్రేయోదాయకమో దయతో నిశ్చయముగా తెలియజేయుము.
Sloka 3-దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను: పాపరహితుడవైన ఓ అర్జునా! ఆత్మానుభూతిని పొందగోరు మానవుల రెండురకములని ఇదివరకే నేను వివిరించితివి. కొందరు దానిని సాంఖ్యము మరియు తాత్విక కల్పన ద్వారా అవగతము చేసికొనగోరగా, మరికొందరు భక్తియోగము ద్వారా దానిని అర్థము చేసికొనగోరుదురు.
Sloka 4- కేవలము కర్మను చేయకుండుట ద్వారా ఎవ్వరును కర్మఫలము నుండి ముక్తిని పొందలేరు. అలాగుననే కేవలము సన్న్యాసము ద్వారా ఎవ్వరును సంపూర్ణత్వమును పొందలేరు.
Sloka 5-ప్రతిమానవుడు భౌతికప్రకృతి వలన తాను పొందినటువంటి గుణము ననుసరించి అవశుడై కర్మ యందు ప్రేరేపింపబడును. కావున ఏదియును చేయకుండ క్షణకాలము కూడా ఎవ్వరును ఉండజాలరు. 
Sloka 6-కర్మేంద్రియములను నిగ్రహించినను మనస్సు ఇంద్రియార్థములందు మగ్నమై యుండువాడు నిశ్చయముగా తనను తాను మోసగించుకొనుచు మిథ్యాచారి యనబడును.
Sloka 7-అట్లుగాక మనస్సు చేత క్రియాశీలక ఇంద్రియములను నిగ్రహించుట యత్నించి సంగత్వము లేనివాడై కర్మయోగమును (కృష్ణభక్తిరసభావన యందు) ఆరంభించు శ్రద్దావంతుడు అత్యుత్తముడు.
To be continued.....

Sri Bhagavad Gita telugu lo chapter 2 sloka 69 to 72

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo..
శ్రీ కృష్ణ భగవంతుడు పలికెను
Chapter 2 sloka 69 to 72
Sloka 69-సకలజీవులకు ఏది రాత్రియో అదియే ఆత్మనిగ్రహము కలవానికి మేల్కొనియుండు సమయము. సర్వజీవులు మేల్కొనియుండు సమయము అంతర్ముఖుడైన మునికి రాత్రి సమయము. 
Sloka 70-సదా సదా పూరింపబడుచున్నను నిశ్చలముగా నుండు సముద్రమునందు నదులు ప్రవేశించు రీతి, తన యందు కోరికలు నిరంతరము ప్రవేశించుచున్నను ఆ ప్రవాహములే కలత నొందనివాడే శాంతిని పొందగలడు. కోరికలను తీర్చుకొన యత్నించువాడు అట్టి శాంతిని పొందజాలడు.
Sloka 71-ఇంద్రియభోగానుభవ కోరికల నన్నింటిని త్యజించి నిష్కామునిగా జీవించుచు, మమకారము మరియు మిథ్యాహంకారము వదిలిపెట్టినవాడు మాత్రమే నిజమైన శాంతిని పొందగలుగును.
Sloka 72- ఇదియే అధ్యాత్మికమును, దివ్యమును అయిన జీవనవిధానము. దీనిని పొందిన పిమ్మట మనుజుడు మోహము నొందడు. మరణసమయమునందును ఆ విధముగా స్థితుడైనవట్టివాడు భగవద్రాజ్యమున ప్రవేశింపగలుగును.
 
Summery- Leave material world and attain moksha, so do Karma with out attachment. Leave results to God VISHNU.
కృష్ణభక్తిభావనము (ఆధ్యాత్మిక జీవనము) మనుజడు క్షణములో పొందవచ్చును లేదా కోట్లాది జన్మలు ఎత్తినను పొందలేక పోవచ్చును. ఇది కేవలము తత్త్వము యొక్క అవగాహన మరియు అంగీకకారముపైననే ఆధారపడి యున్నది. కృష్ణునకు శరణము నొందుట ద్వారా ఖట్వాంగమహారాజు మరణమునకు కొలది నిమిషమునకు ముందే అట్టి జీవనస్థితి పొందగలిగెను. వాస్తవమునకు విషయపూర్ణ జీవనమునకు material life ముగించుటయే నిర్వాణము.  నిజమైన జీవితము భౌతికజీవితపు అంతము పిమ్మట ఆరంభమగుచున్నది.
To be continued with 3rd chapter....

Sri Bhagavad Gita telugu lo chapter 2 sloka 63 to 68

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 2 sloka 63 to 68
శ్రీ కృష్ణ భగవంతుడు పలికెను
Sloka 63-క్రోధమువలన అధికమోహము కలుగగా,మోహము వలన జ్ఞాపకశక్తి భ్రమకు గురియగును. జ్ఞాపకశక్తి భ్రమచే బుద్ధి నాశనమగును. బుద్ధినశించినపుడు మనుజుడు   నాసెంచును   (తిరిగి సంసారగర్తమున పడిపోవును). 
Sloka 64-కాని సమస్త రాగద్వేషముల నుండి ముక్తిపొందినవాడును మరియు విధినియమముల ప్రకారము వర్తించుట ద్వారా ఇంద్రియములను అదుపు చేయగలిగినవాడును అగు మనుజడు భగవానుని సంపూర్ణ కరుణను పొందగలుగును.
Sloka 65-ఈ విధముగా కృష్ణభక్తిరసభావన యందు సంతృప్తి చెందినవానికి త్రివిధ తాపములు కలుగవు. అట్టి సంతృప్త చిత్తము కలిగినపుడు మనుజుని బుద్ధి శీఘ్రమే సుస్థిరమగును.
Sloka 66-(కృష్ణభక్తిభావన యందు) భగవానునితో సంబంధమును పొందనివాడు విశుద్ధబుద్ధిని గాని, స్థిరమైన మనస్సును గాని కలిగియుండజాలడు. అవి లేనిదే శాంతిని పొందటకు ఆస్కారము లేదు. ఇక శాంతి లేనిదే సుఖమెట్లు కలుగును?
Sloka 67-నీటి యందలి నావను బలమైన వాయువు త్రోసివేయు రీతి, మనస్సు దాని యందు లగ్నమైనప్పుడు చరించు ఇంద్రియములలో ఒక్కటైనను సరియే మనుజుని బుద్ధిని హరింపగలదు.
Sloka 68-అందుచే ఓ మాహాబాహో! ఎవ్వని ఇంద్రియములు వాని ఇంద్రియార్థముల నుండి నిగ్రహింపబడియుండునో అతడు నిశ్చయముగా స్థితప్రజ్ఞుడనబడును. 
To be continued..

Sri Bhagavad Gita telugu lo Chapter 2 sloka 56 to 61

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 2 sloka 56 to 61
శ్రీకృష్ణభగవానుడు పలికెను
Sloka 56-త్రివిధ తాపములందును చలింపని మనస్సు గలవాడు, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగనివాడును, రాగము, భయము, క్రోధముల నుండి విడివడినవాడును అగు మనుజుడు స్థిరమైన మనస్సుగల ముని యని చెప్పబడును.
Sloka 57- భౌతికజగమునందు ప్రాప్తించిన మంచి, చెడులను ప్రశంసించుట గాని, ద్వేషించుట గాని చేయక వాటిచే ప్రభావితుడు కానివాడు సంపూర్ణజ్ఞానమునందు స్థిరుడై నిలుచును.
Sloka 58-తాబేలు తన అవయములను లోనికి ముడుచుకొనెడి రీతి, ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములను మరలించువాడు సంపూర్ణమునందు స్థిరముగా నున్నవాడును.
Sloka 59-దేహిని ఇంద్రియభోగముల నుండి నిగ్రహించినను ఇంద్రియార్థముల పట్ల రుచి నిలిచియే యుండును. కాని అత్యున్నత రసాస్వాదన ద్వారా అట్టి కర్మలను అంతరింపజేసి అతడు చైతన్యమునందు స్థిరుడు కాగలుడు.
Sloka 60-ఓ అర్జునా! ఇంద్రియములు బలవంతములను మరియు దృడములును అయియున్నవి. వానిని అదుపు చేయు యత్నించు విచక్షణాపూర్ణుని మనస్సును సైతము అవి హరించివేయుచున్నవి.
Sloka 61-ఇంద్రియములను పూర్ణముగా నియమించి వానిని వశము నందుంచుకొని నా యందే చిత్తమును లగ్నము చేయు మనుజుడు స్థితప్రజ్ఞుడనబడును.
Sloka 62- ఇంద్రియార్థములను ధ్యానించునపుడు వాని యెడ మనుజునికి ఆసక్తి కలుగును. ఆ ఆసక్తి నుండి కామము వృద్ధినొందగా, కామము నుండి క్రోధము ఉద్భవించును.
To be continued...

Sri Bhagavad Gita telugu lo Chapter 2 slokas 50 to 55

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
శ్రీ కృష్ణుడు పలికెను
Chapter 2 slokas 50 to 55
Sloka 50-భక్తియోగమందు నియుక్తుడైనవాడు ఈ జన్మమందే శుభాశుభఫలముల నుండి ముక్తుడగును. కనుక కర్మ యందలి నేర్పుయైనటువంటి ఆ యోగము కొరకు యత్నింపుము. 
Sloka 51-ఆ విధముగా భక్తియోగమునందు నియుక్తులైన మహర్షులు లేదా భక్తులు ఈ భౌతికజగమునందు కర్మఫలముల నునుద్ తమను తాము ముక్తులను కావించుకొందురు. ఆ విధముగా వారు జనన,మరణచక్రము నుండి విడుదలను పొంది (భగవద్దామమును చేరుట ద్వారా) దుఃఖరాహిత్యస్థితిని పొందుచున్నారు. 
Sloka 52-ఎప్పుడు నీ బుద్ధి దట్టమైన మొహారణ్యమును దదాటునో అప్పుడు నీవు వినినదాని యెడ మరియు వినవలసినదాని యెడ విరక్తిని కలిగినవాడవగుదువు. 
Sloka 53-ఎప్పుడు నీ మనస్సు వేదముల మధురవాక్కులచే కలతనొందక ఆత్మానుభూతి యనెడి సమాధి యందు స్థితమగునో అప్పుడు నీవు దివ్యచైతన్యమును పొందినవాడగుదువు. 
Sloka 54-అర్జునుడు పలికెను: ఓ కృష్ణా! సమాధిమగ్నమైన చైతన్యము గలవాని లక్షనము లేవి? అతడు ఏ విధముగా భాషించును, అతని భాష ఎట్టిది? అతడెట్లు కూర్చుండును, ఎట్లు నడుచును?
Sloka 55-శ్రీకృష్ణభగవానుడు పలికెను: ఓ పార్థా! మనుజుడు ఎప్పుడు మానసిక కల్పితములైన సర్వకామములను త్యజించునో మరియు ఆవిధముగా శుద్ధిపడిన మనస్సు ఎప్పుడు ఆత్మ యందు తృప్తినొందునో అప్పుడతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. 
To be continued...

Sri Bhagavad Gita telugu lo Chapter 2 sloka 44 to 49

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 2 sloka 44 to 49..
శ్రీ కృష్ణుడు పలికెను
Sloka 44-భోగానుభవము మరియు లౌకిక సంపదలకు ఆకర్షితులై, వానిచే మొహపరవశులగు వారి మనస్సు నందు భగవానుని భక్తియుక్త సేవను గుర్చిన స్థిరనిశ్చయము కలుగనే కలుగదు. 
Sloka 45- వేదములు ముఖ్యముగా త్రిగుణములకు సంబంధించిన విషయములను గూర్చి చర్చించును. ఓ అర్జునా! నీవు ఈ త్రిగుణములకు అతీతుడవై, ద్వంద్వముల నుండియు మరియు యోగక్షేమములనెడి చింతల నుండియు విడివడినవాడవై ఆత్మ యందు స్థిరుడవగుము.
Sloka 46-చిన్ననుతిచే ఒనగూడు ప్రయోజనములన్నియును శీఘ్రమే పెద్ద జలాశయము నందలి జలముచే సిద్ధించురీతి, వేదముల సమస్త ప్రయోజనములు వాని అంతరార్థమును గ్రహించిన వానికి సిద్ధించుచున్నవి. 
Sloka 47-విధ్యుక్తధర్మమును నిర్వర్తించుట యందే నీకు అధికారము కలదు గాని కర్మఫలమునందు కాదు. నీ కర్మఫలములకు నీవే కారణమని ఎన్నడును భావింపకుము. అలాగుననే విధ్యుక్తధర్మమును వీడుట యందు ఆసక్తుడవు కాకుము.
Sloka 48-ఓ అర్జునా! జయాపజయములందు ఆసక్తిని విడనాడి సమబుద్ధితో నీ విధ్యుక్తధర్మమును నిర్వహింపుము. అట్టి సమభావానమే యోగామనబడును.
Sloka 49-ఓ ధనుంజయా! భక్తియోగముచే హీన కర్మలను దూరము చేసి ఆ భావనలోనే భగవానుని శరణువేడుము. కర్మఫలములను అనుభవింపగోరువారు లోభులు.
To be continued...

Sri Bhagavad Gita telugu lo Chapter 2 sloka 37 to 43

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 2 sloka 37 to 43...
శ్రీ కృష్ణుడు పలికెను 
Sloka 37-ఓ కుంతీ తనయా! నీవు యుద్ధరంగమున చంపబడి స్వర్గమును పొందుతటయో లేక యుద్దమును జయించి రాజ్యమును అనుభవించుటయో జరుగగలదు. కావున కృతనిశ్చయుడవై లేచి యుద్ధము చేయుము. 
Sloka 38-సుఖదు:ఖములను గాని, లాభాలాభములను గాని, జయాపజయములను గాని లెక్కింపక యుద్ధము కొరకే యుద్ధము చేయము.
 ఆ విధముగా చేయుట వలన నీవెన్నడును పాపమును పొందవు.
Sloka 39- ఇంతవరకు ఈ జ్ఞానమును నేను సాంఖ్యము ననుసరించి నీకు వివరించితిని. ఇప్పుడు దానిని ఫలాపేక్ష లేనటువంటి కర్మ రూపమున వివరించెదను ఆలకింపుము. ఓ పృథాకుమారా! అట్టి జ్ఞానము ననుసరించి నీవు వర్తింతువేని కర్మబంధము నుండి విడివడగలవు.
Sloka  40-ఈ ప్రయత్నము నందు నష్టము గాని, హాని గాని లేదు. ఈ మార్గమున స్వల్పపురోగతియు మహత్తరమైన భయము నుండి మనుజుని రక్షించును. 
Sloka 41-ఈ మార్గమున ఉన్నవారు స్థిరప్రయోజనముతో ఒకే లక్ష్యమును కలిగియుందురు. ఓ కురునందనా! స్థిర ప్రయోజనము లేనివారి బుద్ధి అనేక విధములుగా నుండును. 
Sloka 42-43 స్వర్గలోకప్రాప్తి, ఉత్తమజన్మము,అధికారము వంటివానిని పొందుటకై వివిధములైన కర్మలను ఉపదేశించు వేదములందలి మధురమైన వాక్కుల యెడ అల్పజ్ఞులు అనురక్తులగుదురు. భోగానుభవమును మరియు సంపన్న జీవితమును కోరువారగుటచే అట్టివారు దానికి మించినది వేరొకటి లేదని పలుకుదురు. 
To be continued....

Sri Bhagavad Gita telugu lo Chapter 2 sloka 31 to 36

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 2 sloka 31 to 36...
శ్రీ కృష్ణ భగవంతుడు పలికెను
Sloka 31 -క్షత్రియునిగా స్వధర్మము ననుసరించి ధర్మము కొరకై యుద్ధము చేయుట కన్నను శ్రేయోదాయకమైనది వేరోక్కటి లేదని నివెరుగవలెను. కావున సంశయింపవలసిన అవసరమే లేదు. 
Sloka 32-ఓ పార్థా! స్వర్గద్వారములను తెరచునటువంటి యుద్దావకాశమును కోరకనే అప్రయత్నముగా పొందునటువంటి క్షత్రియులు సౌఖ్యవంతులు.
Sloka 33- చేయకుందువేని ధర్మమును అలక్ష్యపరచి నందులకు నిక్కముగా పాపము నొందగలవు. ఆ విధముగా యోధుడవనెడి కీర్తిని నీవు పోగొట్టుకొందువు. 
Sloka 34-జనులు నీ అపకీర్తిని ఎల్లప్పుడును చెప్పుకొనుదురు. గౌరవనీయుడైనవానికి అపకీర్తి యనునది మరణము కన్నను దారుణదారుణమైనది. 
Sloka 35-నీ పేరు ప్రతిష్టల యెడ గొప్ప గౌరవమును కలిగియున్న సేనాదిపతులు భయము చేతనే యుద్ధరంగమును నీవు వీడినావని తలచి నిన్ను చులకన చేయుదురు. 
Sloka 36- శత్రువులు నిన్ను పలు నిర్దయవాక్యములతో వర్ణించుచు నీ సామర్థ్యమును నిందింతురు. ఇంతకన్నను నీకు దుఃఖకరమైనది వేరేది గలదు?
To be continued....

Sri Bhagavad Gita telugu lo...Chapter 2 sloka 25 to 30

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 2 sloka 25 to 30...
శ్రీ కృష్ణుడు పలికెను-
Sloka 25-ఆత్మ కు అంతం లేదు , మరీయు అనూహ్యమైన శాశ్వతమఐనది  , అందువలన  నీ కు ఈ బాధ అనవసరం.
Sloka 26- ఓ మహాబాహో! ఒకవేళ నీవీ ఆత్మ ( లేదా జీవలక్షణములు) ఎల్లప్పుడును పుట్టుచు, మరణించునని తలచినను దుఃఖించుటకు ఎట్టి కారణము లేదు.
Sloka 27-పుట్టినవానికి మరణము తప్పదు మరియు మరణము పిదప జన్మము తప్పదు. కావున అనివార్యమైన నీ విధ్యుక్త ధర్మనిర్వహణము నందు నీవు దుఃఖింపారాదు. 
Sloka 28-సృజింపబడిన జీవులందరు ఆదిలో కనబడక, మధ్యలో కనబడి, నశించిన పిమ్మట తిరిగి కనబడక యుందురు. అట్టి యెడ దుఃఖించుటకు అవసరమేమి కలదు?
Sloka 29-కొందరు ఆత్మను అధ్బుతమైనదానిగా గాంచుదురు. కొందరు దానిని అధ్బుతమైన దానిగా వర్ణింతురు. మరికొందరు దానిని అధ్బుతమైనదానిగా శ్రవణము చేయుదురు. ఇంకొందరు శ్రవణము చేసినను దానిని గూర్చి ఏ మాత్రము తెలియకుందురు. 
Sloka 30-ఓ భరతవంశీయుడా! దేహమందు వసించు దేహి ఎన్నడును చంపబడడు. కావున ఏ జీవిని గూర్చియు నీవు దుఃఖించుట తగదు. 
To be continued....

Sri Bhagavad Gita telugu lo Chapter 2 sloka 19 to 24

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 2 sloka 19 to 24....
శ్రీ కృష్ణుడు పలికెను- Sloka 19-జీవుడు చంపువాడని తలచువాడు గాని, చంపబడువాడని భావించువాడు గాని జ్ఞానవంతులు కారు. ఏలయన ఆత్మ చంపదు మరియు చంపబడదు. 
Sloka 20-ఆత్మకు ఎన్నడును జన్మగాని, మృత్యువు గాని లేదు. అది జన్మింపలేదు, జన్మింపదు, జన్మింపబోదు. జన్మరహితమును, నిత్యమును, శాశ్వతమును, పురాతనమును అగు అట్టి ఆత్మ దేహము చంపబడినను చంపబడదు.
Sloka 21-ఓ పార్థా! ఆత్మ నాశము లేనిదనియు, నిత్యమైనదనియు, పుట్టుకలేనిదనియు, అవ్యయమైనదనియు తెలిసినవాడు ఎవ్వరినేని ఎట్లు చంపును? లేదా చంపించును?
Sloka 22-మనుజుడు పాతవస్త్రములను త్యజించి నూతన వస్త్రములను ధరించు రీతి, ఆత్మ జీర్ణమైన దేహములను త్యజించి నూతన దేహములను పొందుచున్నది.
Sloka 23-ఆత్మ యేటి ఆయుధముల చేతను ఛేదింపబడదు, అగ్నిచే దహింపబడదు, నీటిచే తడుపబడదు, వాయువుచే శోషింపబడదు.
Sloka 24-ఆత్మ ఛేదింపబడనటువంటి మరియు కరుగునటువంటిది. దహింపజేయుటకు గాని, శోషింపజేయుటకు గాని అది వీలుకానటువంటిది. అది నిత్యమును, సర్వత్రా వ్యాపితమును,మార్పురహితమును, అచలమును, సనాతనము అయియున్నది. 
To be continued....

Sri Bhagavad Gita telugu lo Chapter 2 slokas 13 to 18

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 2 slokas 13 to 18...భగవాన్ విష్ణు అవతారం శ్రీ కృష్ణడు పలికెను.......
Sloka 13-దేహధారి దేహమునందు బాల్యము నుండి యౌవనమునకు, యౌవనము నుండి ముదుసలి ప్రాయమునకు క్రమముగా చను రీతి మరణానంతరాము వేరొక దేహమును పొందును. అట్టి మార్పు విషయనున ధీరుడైనవాడు మోహము నొందడు. 
Sloka 14-ఓ కౌంతేయా! తాత్కాలికములైనట్టి సుఖదుఖముల రాకయు, కాలక్రమమున వాటి పోకయు శీతగ్రీష్మకాలముల వంటివి. ఓ భరతవంశీయుడా! ఇంద్రియానుభవము వలన కలుగు అటువంటి ద్వంద్వములను కలతనొందక సహించుట మనుజుడు నేర్వవలెను.
Sloka 15-ఓ మనవశ్రేష్టుడా(అర్జునా)! సుఖదుఃఖములచే కలత నొందక, ఆ రెండింటి యందును ధీరుడై నిలుచువాడు నిక్కముగా మోక్షమునకు అర్హుడై యున్నాడు. 
Sloka 16-
అసత్తునకు(భౌతికదేహము) ఉనికి లేదనియు మరియు నిత్యమైనదానికి(ఆత్మ) మార్పు లేదనియు సత్యద్రష్టలైనవారు నిర్ణయించియున్నారు. ఈ రెండింటి తత్త్వమును బాగుగా అధ్యయనము చేసి వారీ విషయమున ధృవీకరించిరి. 
Sloka 17-శరీరమందంతటను వ్యాపించియున్న ఆత్మా నశింపు లేనటువంటిదని నీవు తెలిసికొనుము. అట్టి అవినాశియైన ఆత్మను నశింపజేయుటకు ఎవ్వడును సమర్థుడు కాడు. 
Sloka 18- అవినాశియును, అపరిమితుడును, నిత్యుడును అగు జీవుని దేహము తప్పక నశించియే తీరును. కావున ఓ భరతవంశీయుడా! నీవు యుద్ధము చేయుము. 
To be continued...

Sri Bhagavad Gita telugu lo Chapter 2 Sloka 7 to 12

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 2 Sloka 7 to 12.....
Sloka 7- కార్పణ్యదోష కారణమున నేనిపుడు నా స్వధర్మ విషయమున మోహము చెంది శాంతిని కోల్పోయియితిని. ఏది నాకు ఉత్తమమో నిశ్చయముగా తెలుపమని నిన్ను నేను అడుగుచున్నాను. నేనిపుడు నీకు శిష్యుడనుశిష్యుడను మరియు శరణాగతుడను. దయచేసి నాకు ఉపదేశము కావింపుము. 
Sloka 8- ఇంద్రియములను శోషింపజేయునటువంటి ఈ శోకనును తొలగించుకొను మార్గమును నేను గాంచలేకున్నాను. దేవతల స్వర్గాధిపత్యమువలె సంపత్సమృద్ధమును మరియు శత్రురహితమును అగు రాజ్యమును ధరత్రిపై సాధించినను ఈ శోకమును నేను తొలగించుకొనజాలను. 
Sloka 9- సంజయుడు పలికెను: శత్రువులను తపింపజేయు అర్జునుడు ఆ విధముగా పలికి, పిదప శ్రీకృష్ణునితో “ గోవిందా! నేను యుద్దమును చేయను” అని పలికి మౌనమును వహించెను.
Sloka 10-ఓ భరతవంశీయుడా! ఇరుసేనల నడుమ శ్రీకృష్ణుడు నవ్వుచున్నవాని వలె ఆ సమయమున దుఃఖితుడైన అర్జునునితో ఇట్లు పలికెను. 
Sloka 11-పూర్ణపురుషోత్తముడగు శ్రీకృష్ణభగవానుడు పలికెను : ప్రజ్ఞను గూడిన పలుకులను పలుకుచునే నీవు దుఃఖింపదాగని విషయమును గూర్చి దుఃఖించుచున్నావు. పండితులైనవారు జీవించియున్నవారిని గూర్చిగాని, మరణించినవారిని గూర్చిగాని దుఃఖింపరు.
Sloka 12-నేను గాని, నీవు గాని, ఈ రాజులందరు గాని నిలిచియుండని సమయమేదియును లేదు. అలాగుననే భవిష్యత్తు నందు మనమెవ్వరు ఉండకపోము. 
To be continued.....

Sri Bhagavad Gita telugu loChapter 2 sloka 1 to 6....

శ్రీ భగవద్ గీత తెలుగు లో--Sri Bhagavad Gita telugu lo
Chapter 2 sloka 1 to 6....
సంజయుడు పలికెను: 
Sloka 1-చింతాక్రాంతుడై కనుల యందు అశ్రువులను దాల్చి కృపాపూర్ణుడైనట్టి అర్జునిని గాంచిన మధుసూదనుడు (శ్రీకృష్ణుడు) ఈ క్రింది వాక్యములను పలికెను. 
Sloka 2 - శ్రీకృష్ణభగవానుడు పలికెను: ఓ అర్జునా! నీకీ కల్మషము ఎచ్చట నుండి ప్రాప్తించినది? జీవితపు వీలువ నెరిగిన మనుజునకు ఇది అర్హము కానట్టిది. ఇది ఉన్నత లోకములను లభింపజేయదు. పైగా అపకీర్తిని కలిగించును. 
Sloka 3- ఓ పృథాకుమారా! పతనకారక నపుంసకత్వమునకు లొంగకము. ఇది నీకు తగదు. ఓ పరంతపా! ఇట్టి హృదయదుర్బలతను విడినాడి వెంటనే లెమ్ము. 
Sloka 4-అర్జునుడు పలికెను: ఓ శత్రుసంహారా! ఓ మధుసూదనా! పూజార్హులైన భీష్మ ద్రోణుల వంటివారిని నేనెట్లు బాణములతో యుద్ధమునందు ఎదుర్కొనగలను?
Sloka 5-గురువులైన మహాత్ముల జీవితములను పణముగా పెట్టి జీవించుట కన్నను భిక్షమెత్తి జీవించుట ఈ జగమున ఉత్తమమైనది. ప్రాపంచిక లాభమును కోరుచున్నప్పటికి వారందరును పెద్దలే. వారిని వధించినచో మేము అనుభవించు సమస్తమును రక్తపంకిలమగును. 
Sloka 6-వారిని జయించుట ఉత్తమమో లేక వారిచే జయింపబడుట ఉత్తమమో మేము తెలియకున్నాము. ధృతరాష్ట్రుని తనయులను చంపినచో మేమిక జీవించియుండుట వ్యర్థము. అయినప్పటికిని వారిపుడు యుద్ధరంగమున మా ఎదుట నిలిచియున్నారు. 
To be continued...

Wednesday 22 April 2020

Sri Bhagavad Gita telugu lo...Chapter 1 sloka 39 to 4

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo...
Chapter 1 sloka 39 to 46...అర్జునుడు పలికెను...
Sloka 39- కులక్షయము వలన శాశ్వతమైన వంశాచారము నశించిపోవును. ఆ విధముగా వంశమున మిగిలిన వారు అధర్మవర్తనులగుదురు.
Sloka 40-ఓ కృష్ణా! వంశము నందు అధర్మము ప్రబలమగుట వలన కులస్త్రిలు చెడిపోవుదురు. ఓ వృష్ణివంశసంజాతుడా! అట్టి కులస్త్రి పతనము వలన అవాంఛనీయ సంతానము వృద్ధినొందును.
Sloka 41-అవాంచిత సంతానము వృద్ధియగుట వలన కుటుంబమువారు మరియు కుటుంబ ఆచారమును నష్టపరచినవారు ఇరువురికి నరకము సంప్రాప్తించును. పిండోదక క్రియలు సంపూర్ణముగా ఆపివేయబడుటచే అట్టి అధర్మ కుటుంబములకు చెందిన పితురులు పతనము నొందుదురు.
Sloka 42-వంశాచారమును నశింపజేసి దుష్టసంతానమునకు కారణమగు వారి పాపకర్మల వలన కులధర్మములు మరియు జాతిధర్మములు నాశనమగును. 
Sloka 43- ఓ కృష్ణా! జనార్దనా! కులధర్మములను నాశనము చేయువారు శాశ్వతముగా నరకవాసము చేయుదురని గురుశిష్య పరంపరానుగతముగా నేను వినియుంటిని.
Sloka 44-అహో! ఘోరమైన పాపకర్మలను చేయుటకు మేము సిద్ధపడుట ఎంత విచిత్రము! రాజ్యసుఖమును అనుభవించవలెననెడి కోరికతో మేము స్వజనమును చంపగోరుచున్నాము. 
Sloka 45- నిరాయుధుడు మరియు ప్రతీకారము చేయనివాడను అగు నన్ను శస్త్రధారులైన ధృతరాష్ట్రుని పుత్రులు రణరంగమునందు వధించినచో అది నాకు క్షేమకరమే కాగలదు.
Sloka 46-సంజయుడు పలికెను: రణరంగమునందు అర్జునుడు ఆ విధముగా పలికి ధనుర్భాణములను పడవేసి దుఃఖముచే కల్లోలితమైన మనస్సు కలవాడై రథమునందు కూర్చుండిపోయెను.
To be continued...with 2nd chapter....

Sri Bhagavad Gita telugu lo..Chapter 1 sloka 32 to 38....

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita telugu lo..
Chapter 1 sloka 32 to 38.....అర్జునుడు పలికెను....
ఓ గోవిందా! మేమెవరి కొరకు రాజ్యమును, సుఖమును, చివరకు జీవనమును సైతము కోరుచున్నమో వారందరును ఈ యుద్ధమున నిలిచియుండగా ఆ రాజ్యాదుల వలన మాకు కలుగు ప్రయోజనమేమి? ఓ మధుసుధనా! ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు, ఇతర బందువులందరును తమ ఆస్తులను మరియు ప్రాణములను విడిచిపెట్టుటకు సంసిద్ధులై నా యెదుట నిలబడి నన్ను చంపగోరినను నేనెందులకు వారిని చంపగోరవలెను? ఓ జనార్ధనా! ఈ ధరాత్రి విషయమటుంచి ముల్లోకములను పొందినను నేను వారితో యుద్ధము చేయుటకు సిద్ధముగా లేను. ధృతరాష్ట్రుని తనయులను వధించుట వలన మేమెట్టి ఆనందము పొందగలము?
Sloka 36- ఇట్టి దుర్మార్గులను చంపినచో మాకు పాపమే సంక్రమించును. కావున ధృతరాష్ట్రుని తనయులను మరియు మా స్నేహితులను సంహరించుట మాకు ఉచితము కాదు. లక్ష్మీపతివైన ఓ కృష్ణా! స్వజనమును చంపుట వలన మాకు కలుగు లాభమేమి? ఆ కార్యముచే మేమెట్లు సుఖమును పొందగలము?
Sloka 37-38- ఓ జనార్దనా! లోభపూర్ణ చిత్తము కలిగిన విరందరును కులసంహారమునందు గాని, బంధువులతో కలహమునందు గాని దోషమును గాంచకున్నాను, వంశనాశనము నందు దోషము గాంచగలిగిన మేమెందులకు ఇట్టి పాపకార్యమునందు నియుక్తులను కావలెను?
To be continued...

Sri Bhagavad Gita Telugu lo..Chapter 1 slokas 25 to 31.......

శ్రీ భగవద్ గీత తెలుగు లో- Sri Bhagavad Gita Telugu lo..
Chapter 1 slokas 25 to 31.......
Sloka - 25 భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర భుపలకుల సమక్షమున శ్రీకృష్ణుడు “ఓ పార్థా! ఇచ్చట కూడియున్నటువంటి కురువంశీయులందరిని గాంచుము” అని పలికెను. 
Sloka 26- ఇరుపక్షపు సేనల నడుమ నిలిచిన అర్జునుడు అచ్చట తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుమలను, స్నేహితులను, మామలను, శ్రేయోభిలాషులను గాంచెను.
Sloka 27- నానావిధ బంధువులను, స్నేహితులను గాంచినంతట కుంతీతనయుడైన అర్జునుడు కరుణను కూడినవాడ ఈ విధముగా పలికెను.
Sloka 28- శ్రీకృష్ణభగవానుని యెడ నిష్కపటమైన భక్తికలవాడెవడైనను దివ్యపురుషుల యందు లేదా దేవతల యందు గోచరించు సమస్త.
Sloka 29-నా దేహమంతయు కంపించుచున్నది. నాకు రోమాంచమగుచున్నది. గాండివధనుస్సు నా చేతి నుండి జారిపోవుచున్నది, నా చర్మము మండిపోవు చున్నది.
Sloka 30- భాష్యమునేను ఇపుడు ఏ మాత్రము నిలబడలేకపోవుచున్నాను. నన్ను నేనే మరచిపోవుచున్నాను. నా మనస్సు చలించుచున్నాన్ను. ఓ కృష్ణా! కేశిసంహారీ! కేవలము విపరీతములననే నేను గాంచుచున్నాను. 
Sloka 31-ఓ కృష్ణా! ఈ యుద్ధమునందు నా స్వజనమును చంపుట ద్వారా ఏ విధముగా శ్రేయస్సు కలుగగలదో నేను గాంచలేకున్నాను. తదనంతర విజయమును గాని, రాజ్యమును గాని, సుఖమును గాని నేను వాంఛింపలేకున్నను. 
To be continued.......

Sri Bhagavad Gita telugu lo Chapter 1 Slokas 16 to 24...

శ్రీ భగవద్ గీత తెలుగు లో-- Sri Bhagavad Gita telugu lo 
Chapter 1 Slokas 16 to 24...
Sloka 16 to 18 ఓ రాజా! కుంతీపుత్రుడైన యుధిష్టిరుడు అనంతవిజయమనెడి తన శంఖమును పూరించగా, నకులుడు సుఘోషమనెడి శంఖమును, సహదేవుడు మణిపుష్పకమనెడి శంఖమును పూరించిరి. గొప్ప విలుకాడైన కాశీరాజు, యోధుడైన శిఖండి, ధృష్టధ్యుమ్నుడు, విరాటుడు, జయింపరానటువంటి సాత్యకి, ద్రుపదుడు, ధ్రౌపదీతనయులు, గొప్ప బాహువులు గలిగిన సుభాద్రాతనయుడు మున్నగు వీరులందరును తమ తమ శంఖములను పూరించిరి. 
Sloka 19- ఆ వివిధశంఖముల ధ్వని అతిభీకరమయ్యెను. భూమ్యాకాశములు రెండింటిని కంపించుచు అది ధృతరాష్ట్ర తనయుల హృదయము బ్రద్దలు చేసెను.
Sloka 20-ఆ సమయమున పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథమునందు నిలిచి, ధనుస్సును చేపట్టి బాణములను విసురుటకు సిద్ధపడెను. ఓ రాజా! వ్యూహముగా నిలిచియున్నా ధృతరాష్ట్ర తనయులను గాంచి అతడు శ్రీకృష్ణభగవానునితో ఈ వాక్యములను పలికెను.
Sloka 21-22- అర్జునుడు పలికెను : ఓ అచ్యుతా! దయచేసి రెండుసేనల నడుమ నా రథమును నిలుపుము. తద్ద్వార యుద్ధము చేయగోరి ఇచ్చట ఉపస్థితులైనవారిని మరియు మాహాసంగ్రామమున నేను తలపడవలసినవారిని గాంచగలుగుదును.
Sloka 23-దుష్టబుద్ధి గల ధృతరాష్ట్రతనయునికి ప్రియమును గూర్చుటకై యుద్ధము నొనరించుటకు ఇచ్చటకు విచ్చేసిన వారిని నేను చూచెదను.
Sloka 24-సంజయుడు పలికెను : ఓ భరతవంశీయుడా! అర్జునునిచే ఆ విధముగా సంభోదింపబడినవాడై శ్రీకృష్ణభగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్షపు సేనల నడుమ నిలిపెను.
To be continued....

Sri Bhagavad Gita telugu lo Chapter 1 slokas 9 to 15....

శ్రీ భగవద్ గీత తెలుగు లో... Sri Bhagavad Gita telugu lo 
Chapter 1 slokas 9 to 15....
Chapter 1 sloka 9- నా కొరకు తమ జీవితములను త్యాగము చేయుటకు సిద్ధపడియున్న వీరులు ఇంకను పలువురు కలరు. వారందరును పలువిధములైన ఆయుధములను దాల్చినవారు మరియు యుద్ధనిపుణతను కలిగినవారును అయియున్నారు. 
Sloka 10-మన సైన్యబలము లెక్కింప విలులేనిదిగా నున్నది మరియు మనము పితామహుడైన భీష్మునిచే సంపూర్ణముగా రక్షింపబడుచున్నాము. కాని భీమునిచే జాగరూకతతో రక్షింపబడుచున్న పాండవసైన్యము పరిమితముగా నున్నది.
Sloka 11-సేనావ్యూహ ద్వారమునందలి మీ ముఖ్యస్థానములలో నిలిచియుండి మీరు పితామహుడైన భీష్మదేవునకు సంపూర్ణ రక్షణమును కూర్చవలసియున్నది.
Sloka 12-అప్పుడు కురువృద్దుడును, యోధుల పితామహుడును అగు భీష్ముడు దుర్యోధనునకు ఆనందమును గూర్చుచు సింహగర్జన వంటి ధ్వని కలుగునట్లుగా తన శంఖమును బిగ్గరముగా పూరించెను.
Sloka 13-అటుపిమ్మట శంఖములు, పణవానకములు, భేరులు, కొమ్ములు ఆదివి అన్నియు ఒక్కసారిగా మ్రోగింపబడెను. ఆ సంఘటిత ధ్వని అతిభీకరముగా నుండెను. 
Sloka 14-ఎదుటి పక్షమున శ్రీకృష్ణభగవానుడు, అర్జునుడు ఇరువురును తెల్లని గుఱ్ఱములు పూన్చబడిన మహారథమునందు ఆసీనులైనవారై తమ దివ్యశంఖములను పురించిరి. 
Sloka 15-శ్రీకృష్ణభగవానుడు పాంచజన్యమనెడి తన శంఖమును పూరించెను; అర్జునుడు దేవదత్తమనెడి తన శంఖమును పూరించెను; భోజనప్రియుడు, ఘన కార్యములను చేయువాడు అగు భీముడు పౌండ్రమనెడి తన మాహాశంఖము నూదెను.
To be continued...

Sri Bhagavad Gita Telugu loChapter 1 sloka 1 to 8

శ్రీ భగవద్ గీత తెలుగు లో-- Sri Bhagavad Gita Telugu lo
Chapter 1 sloka 1 to 8............
Chapter 1  sloka 1- ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను: ఓ సంజయా! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయగోరువారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి?
Sloka 2 - సంజయుడు పలికెను: ఓ రాజా! పాండుతనయులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఈ క్రింది విధముగా పలికెను.
Sloka 3- ఓ ఆచార్యా! మీ బుద్ధికుశలుడైన శిష్యుడగు ద్రుపదతనయునితో దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను గాంచుము.
Sloka 4 - ఈ సైన్యమునందు భీమార్జునులతో సమానముగా యుద్ధము చేయగల శూరులైన ధనుర్ధరులు పెక్కురు గలరు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగువారు అటువంటి మహాయోధులు.
Sloka 5- ధృష్ట కేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తుడు, కుంతీభోజుడు, శైబ్యుడు వంటి శూరులైన మహాయోదులును అందున్నారు.
Sloka 6- పరాక్రమవంతులైన యుధామన్యుడు, శక్తిశాలియైన ఉత్తమౌజుడు, సుభద్రా తనయుడు, ద్రౌపదికుమారులును అందున్నారు. ఈ వీరులందరును మహారథులు.
Sloka 7- కాని ఓ బ్రాహ్మణోత్తమా! నా సేనాబలమును నడుపుటకై ప్రత్యేకముగా యోగ్యులైనట్టి నాయకులను గూర్చి మీ కొరకై నేను తెలియజేసెదను.
Sloka 8- యుద్దమునందు ఎల్లప్పుడును విజయమును సాధించు మీరు,భీష్ముడు, కర్ణుడు,కృపుడు, అశ్వత్థామ,వికర్ణుడు మరియు సోమదత్తుని తనయుడైన భూరిశ్రవుడు వంటివారు మన సైన్యము నందున్నారు.
To be continued...